Thursday, October 24

ఒకటా.. రెండా..! భారత్‌ స్థానం తేలేది నేడే

ఒకటా.. రెండా..!
భారత్‌ స్థానం తేలేది నేడే
చివరి లీగ్‌ మ్యాచ్‌లో శ్రీలంకతో ఢీ

ఒకటా.. రెండా! పాయింట్ల పట్టికలో భారత్‌ స్థానం ఏది! కోహ్లీసేన ఇప్పటికే ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ చేరడంతో ఇప్పుడు మిగిలి ఉన్న ఆసక్తి ఇదే. ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియా ఆఖరి లీగ్‌ సమరానికి సిద్ధమైంది. నేడు శ్రీలంకను ఢీకొట్టనుంది. 13 పాయింట్లతో ఉన్న భారత్‌కు అగ్రస్థానం దక్కాలంటే ఈ మ్యాచ్‌లో నెగ్గితేనే సరిపోదు. శనివారమే జరిగే మరో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా (14 పాయింట్లు).. దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోవాలి. నేటితో ప్రపంచకప్‌ లీగ్‌ దశ ముగియనుంది. భారత్‌ అగ్రస్థానం సాధిస్తే.. న్యూజిలాండ్‌తో, రెండో స్థానంలో నిలిస్తే ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్లో ఆడుతుంది.

లీడ్స్‌: పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని ఆశిస్తున్న టీమ్‌ఇండియా శనివారం జరిగే మ్యాచ్‌లో శ్రీలంకను ఢీకొంటుంది. సెమీస్‌లో స్థానం ఖాయమైనప్పటికీ ఈ మ్యాచ్‌ కోహ్లీసేనకు ముఖ్యమైనదే. టోర్నీలో ఎనిమిది మ్యాచ్‌లు ఆడినా తడబాటు పోని మిడిల్‌ ఆర్డర్‌ గాడినపడేందుకు ఇదో చక్కని అవకాశం. పిచ్‌ స్పిన్‌కు అనుకూలించే అవకాశమున్నందున భారత్‌ ఇద్దరు స్పిన్నర్లు చాహల్‌, కుల్‌దీప్‌లతో బరిలోకి దిగే అవకాశముంది. భువనేశ్వర్‌, షమిలలో ఒకరే జట్టులో ఉండొచ్చు. ధోనీని ఐదో స్థానం నుంచి నాలుగుకు పంపిస్తారా అన్నది ఆసక్తికరం. శ్రీలంకను తక్కువ అంచనా వేస్తే పొరపాటే అవుతుంది. ఆ జట్టు ఇంగ్లాండ్‌కు షాకిచ్చిన సంగతి తెలిసిందే. లంక ఫాస్ట్‌బౌలర్‌ లసిత్‌ మలింగకు బహుశా.. ఇదే చిట్టిచివరి ప్రపంచకప్‌ మ్యాచ్‌.

1
లంకతో మ్యాచ్‌లో తొలి బంతికే బుమ్రా వికెట్‌ తీస్తే హ్యాట్రిక్‌ ఖాతాలో చేరుతుంది.

బంగ్లాతో చివరి మ్యాచ్‌లో ఆఖరి రెండు బంతులకు అతడు వికెట్లు పడగొట్టిన సంగతి తెలిసిందే.

మధ్యాహ్నం 3 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌లో
దక్షిణాఫ్రికా × ఆసీస్‌
సాయంత్రం 6 నుంచి

Related posts:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *