Thursday, October 24

శవాలపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు

శవాలపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు
యూపీ ప్రమాదంలో హృదయ విదారక ఘటన

ఆగ్రా: ‘మేమంతా గాఢ నిద్రలో ఉన్నాం. ఒక్కసారిగా బస్సు కుదుపులకు లోనైంది. ఏమైందో తెలుసుకునే లోపే నుజ్జునుజ్జయ్యింది. ఒక్క క్షణం హాహాకారాలు వినిపించాయి. ఆ తర్వాత అంతా నిశ్శబ్దం.. చుట్టూ చీకటి..’ అంటూ ఉత్తరప్రదేశ్‌ బస్సు ప్రమాదం నుంచి బయటపడిన రిషి యాదవ్‌ ఆ భయానక ఘటనను గుర్తుచేసుకున్నారు. యూపీలోని ఆగ్రా సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ రిషి ప్రస్తుతం ఆగ్రాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రాణాలు రక్షించుకునే క్రమంలో కొందరు ప్రయాణికులు శవాలపైకి ఎక్కి బస్సు నుంచి బయటకొచ్చారని రిషి తెలిపారు.

గృహప్రవేశానికి వచ్చి వెళ్తూ..

బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఒక్కొక్కరిదీ ఒక్కో దీన గాథ. లఖ్‌నవూకు చెందిన అవినాశ్‌ అవాస్థి గ్రేటర్‌ నోయిడాలో క్లర్క్‌గా పనిచేస్తున్నారు. జులై 4న తన కొత్త ఇంటి గృహప్రవేశం కోసం లఖ్‌నవూ వచ్చారు. తిరిగి వెళ్తూ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.

అరిబా ఖాన్‌ది చాలా పేద కుటుంబం. ఆమె సంపాదిస్తే గానీ పూట గడవని స్థితి. నవీ ముంబయిలో పనిచేస్తున్న ఆమె.. ఇటీవల తన తండ్రికి గుండెపోటు రావడంతో చూసేందుకు సొంత ఊరికి వచ్చారు. తిరిగి వెళ్తూ ప్రమాదానికి గురయ్యారు.

యూపీ రోడ్‌వేస్‌కు చెందిన జన్‌రథ్‌ ఏసీ స్లీపర్‌ కోచ్‌ బస్సు (అవధ్‌ డిపో) లఖ్‌నవూ నుంచి దిల్లీ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అతి వేగం, డ్రైవర్‌ నిద్రమత్తుతో కునుకు వేయటం వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. సుమారు 20 అడుగుల ఎత్తు నుంచి పడిపోవటంతో బస్సు నుజ్జునుజ్జయ్యింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 30కి పెరిగింది. పలువురు గాయపడగా వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

Related posts:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *