Wednesday, January 19

ఒకరినొకరు రెచ్చగొట్టుకోవడంతో ముదిరిన వివాదం

ఘర్షణకు కారణం ల్యాండ్‌ సెటిల్‌మెంటే
ఒకరినొకరు రెచ్చగొట్టుకోవడంతో ముదిరిన వివాదం
వివరాలు వెల్లడించిన విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు
విజయవాడ.

బెజవాడ గ్యాంగ్‌వార్‌ కేసులో విచారణ పూర్తయింది. ఒకప్పుడు స్నేహితులుగా ఉన్న సందీప్‌, పండులు ఘర్షణ పడటానికి కారణాలేంటి.? వారి మధ్య వివాదాలు చంపుకొనే స్థాయికి ఎందుకు చేరుకున్నాయి..? అసలు ఒక్కసారిగా కత్తులు దూసుకునే పరిస్థితులు ఎందుకు వచ్చాయ్‌.? అనే అంశాలపై విచారించారు. నిందితులను గుర్తించేందుకు సీసీ కెమెరా వీడియోలు, ప్రత్యక్ష సాక్షులు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. ఈ కేసుకు సంబంధించి పండుతో పాటు 13 మందిని అరెస్టు చేశారు. వీరిని శుక్రవారం మీడియా ముందు ప్రవేశపెట్టిన నగర పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు.. మిగిలిన వారిని త్వరలో పట్టుకుంటామని తెలిపారు.

సీపీ మాట్లాడుతూ…

‘యనమలకుదురుకు చెందిన ప్రదీప్‌రెడ్డి, కానూరుకు చెందిన ధనేకుల శ్రీధర్‌లు 2018లో 7 సెంట్ల భూమిలో గ్రూప్‌హౌస్‌ నిర్మాణం చేపట్టారు. దీన్ని 2019లో పూర్తి చేశారు. మొత్తం రూ.1.50 కోట్ల వ్యయంతో చేపట్టినఈ నిర్మాణానికి తొలుత ప్రదీప్‌రెడ్డి, శ్రీధర్‌లు చెరో రూ.40లక్షలు పెట్టుబడి పెట్టారు. అనంతరం ప్రదీప్‌రెడ్డి
తప్పుకోవడంతో మిగతా రూ.70లక్షలు పెట్టి శ్రీధర్‌ దాన్ని పూర్తి చేశారు. ఒప్పందం ప్రకారం స్థల యజమానికి ఫ్లాట్లు ఇచ్చిన తర్వాత.. మిగిలిన ఫ్లాట్లు పంచుకునే సమయంలో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో ప్రదీప్‌రెడ్డి బుట్ట నాగబాబు అలియాస్‌ చిన్న నాగబాబును ఆశ్రయించాడు. దీంతో అతను సెటిల్‌మెంట్‌ చేసేందుకు గతనెల 29న కలుసుకున్నారు. ఈ సెటిల్‌మెంట్‌లో తోట సందీప్‌,
కోడూరి మణికంఠ అలియాస్‌ పండులు పాల్గొనడం వివాదానికి దారితీసింది. పండు సెటిల్‌మెంట్‌లో పాల్గొనడం సందీప్‌కు నచ్చలేదు. దీంతో పండుకి ఫోన్‌ చేసిన సందీప్‌.. ‘నేనుండగా మధ్యవర్తిత్వం చేయడానికి నువ్వు ఎందుకు వచ్చావ్‌ అని నిలదీశాడు. కొంత సంభాషణ తర్వాత ఒకరినొకరు దూషించుకోవడం, బెదిరించడం చేసుకున్నారు. అదే రోజు అర్ధరాత్రి సందీప్‌, అతని తమ్ముడు జగదీష్‌లు తన
అనుచరులతో పండు ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో పండు లేకపోవడంతో అతని తల్లితో గొడవపెట్టుకుని వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న పండు తర్వాత రోజు(మే 30) పటమటలో సందీప్‌ నడుపుతున్న ఇనుప దుకాణం వద్దకు వచ్చాడు. ఆ సమయంలో సందీప్‌ లేకపోవడంతో షాపులో ఉన్న సాగర్‌, రాజేష్‌లపై దాడి చేసి గాయపరచడంతో పాటు హెచ్చరించాడు. ఈ విషయం తెలుసుకున్న సందీప్‌ పండుకు ఫోన్‌ చేయడం.. ఒకరినొకరు నువ్వెంత అంటే.. నువ్వెంత అని సవాల్‌ చేసుకున్నారు. అనంతరం వీరు మాట్లాడుకునేందుకు అదే రోజు సాయంత్రం 4.30 గంటలకు పటమట తోటావారి వీధిలోని గ్రేస్‌ చర్చి వద్ద ఖాళీ స్థలంలో కలిశారు. వీరిద్దరి మధ్య మాటాపెరగడంతో.. అప్పటికే వారి వెంట తెచ్చుకున్న
కారం చల్లి, కత్తులు, బ్లేడ్లు, రాడ్లు, రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో సందీప్‌, పండులు తీవ్రంగా గాయపడగా.. వారి అనుచరులే వారిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో సందీప్‌ ఈనెల 31వ తేదీ సాయంత్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా.. పండు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని’ తెలిపారు.

13 మంది అరెస్టు..

‘ఘర్షణ విషయం తెలుసుకున్న పటమట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని డీసీపీ హర్షవర్థన్‌ ఆధ్వర్యంలో ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. విచారణలో సందీప్‌ మృతికి కారణమైన ప్రధాన నిందితులను అరెస్టు చేశాం. ఈనెల 4వ తేదీ రాత్రి సనత్‌నగర్‌కు చెందిన రేపల్లె ప్రశాంత్‌, యనమలకుదురుకు చెందిన ఆకుల రవితేజ అలియాస్‌ బుల్లి, శివశంకర్‌నగర్‌కు చెందిన పందా ప్రేమ్‌కుమార్‌, పందా ప్రభుకుమార్‌, రామలింగేశ్వర్‌నగర్‌కు చెందిన భాణావత్‌ శ్రీను నాయక్‌లను అరెస్టు చేయగా.. శుక్రవారం ఉదయం పటమటకు చెందిన లంకలపల్లి వెంకటేష్‌ అలియాస్‌ ఖైనీ, సనత్‌నగర్‌కు బూరి భాస్కరరావు అలియాస్‌ బాషా, పటమట తోటావారి వీధికి చెందిన ప్రతాప సాయి ప్రవీణ్‌కుమార్‌, యర్రా తిరుపతిరావు శాంతినగర్‌కు చెందిన పొన్నాడ సాయి అలియాస్‌ గాలి సాయి, సిర్రా సంతోష్‌, యనమలకుదురుకు చెందిన ఓరుగంటి దుర్గాప్రసాద్‌, ఓరుగంటి అజయ్‌లను అరెస్టు చేశాం. నిందితుల నుంచి కొబ్బరి బొండాల కత్తి, పొడవాటి కత్తి, స్నాప్‌కట్టర్‌, కోడి కత్తి, రాడ్డు, ఆరు ఫోల్డింగ్‌ బ్లేడులు, నాలుగు బ్లేడ్లు, మూడు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నాం’ అని సీపీ వివరించారు.రౌడీషీటర్లపై మరింత నిఘా
‘లాక్‌డౌన్‌ కారణంగా కొన్ని రోజులుగా రౌడీషీటర్లకు కౌన్సెలింగ్‌ ఇవ్వడం లేదు. అయినా వీరిలో యాక్టివ్‌గా ఉన్న వారిపై నిఘా ఉంచాô. ప్రస్తుతం జరిగిన ఘటన మళ్లీ పునరావృతం కాకుండా ఉండేందుకు నిఘాను మరింత పెంచాం.
ఈ విషయంలో ఇప్పటికే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. ప్రశాంతంగా ఉన్న విజయవాడలో అసాంఘిక, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే సహించేది లేదు. ఇకపై గ్యాంగ్‌వార్‌లు, ఘర్షణలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని’
సీపీ హెచ్చరించారు.